సూర్యుడు పూవులా ఉదయిస్తాడు
, కాలం తేనే లా చిమ్ముతూ పైకొస్తుంది.
ఒక్కో క్షణం ఒక్కో
అనుభూతిని మనకందించి, మనం తేరుకుని చూసేలోపు మాయమయిపోతుంది.
అందుకే జీవితం చాలా
విలువైనది, కారణం అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియని అందమైన గాజు బొమ్మ.
మనం ఏమరపాటు లో ఉండిపోతే,
ఏదో ఓకే క్షణం, తన వెంట మృత్యువుని తీసుకోచ్చేస్తుంది. ఆ పై మనం చదవాల్సిన
కవిత్వం, చేయాల్సిన పనులూ, వినాల్సిన పాటలు, అన్నిటికంటే మించి, ప్రేమించాల్సిన
మనుషులూ క్షణాలూ, వీటన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది.
ప్రత్యూష సమయంలో దేవతార్చన,
భాస్కరుని జాడలో పుస్తకపఠనం,
సాయంవేళల చల్లని పలకరింత,
వెన్నెల నీడలో ప్రియ సంగమం,
ఇవన్నీ వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది.
మళ్ళీ మళ్ళీ మనకు దేవుడూ,
మనుషులూ దొరకరు, పూజించటానికీ, ప్రేమించడానికీ.
ఇతరులు మనకి నీళ్లొదులుతుంటే,
మనం కన్నీళ్లోదులుతూ వారిని విడిచిపెట్టెయ్యాలి.
అందుకే... అందుకే ఈ క్షణం
నుండీ ఏ క్షణం వృధా చేయకు.
నష్టమయిన క్షణాలన్నీ ఇసుక
రేణువులై కాల మహాసముద్రపు ఒడ్డున పడున్నాయి.
కెరటమంత జీవితంలో క్షణమైనా సుఖం ఉంది,
ఆ క్షణం కోసం జన్మంతా వెతికితే బాగుంటుంది.