Pages

26/03/2016

అన్నమయ్య భక్తి - త్యాగరాజస్వామి సాధన

నా బ్లాగ్ లో "రామచంద్రుడితడు..." మీద రాసుకున్న notes ని మిత్రులు ఫణీంద్ర గారు Facebook లో share చేస్తే ఒకాయన comment పెట్టారు, అసలు అన్నమయ్య కి త్యాగరాజస్వామి కి పోలికలు ఎవరైనా చెబితే బాగుంటుంది అన్నారు. అది చేసే స్థాయి ఏ మాత్రం లేకపోయినా.... చెరువులో రాయి వేస్తే అలలు కదిలినట్టు నా లో ఏదో కదలిక ...
ఇక్కడ రాసినదంతా నా అతి పరిమిత దృష్టికి స్ఫురించినవే... తప్పులుంటే మన్నించండి...

08/06/2014

“నువ్వు లేవు”

నువ్వు లేవు దగ్గర, కానీ నీ జ్ఞాపకాలు ,
సవ్వడి లేని మదిలో రాశుల కొద్దీ

నా ముఖాన నీ కొంగును సుతారంగా కప్పిన క్షణం
గుసగుసలాడుతుంటే వచ్చిన పరిమళాలు గుర్తున్నాయా?
నీ కురులను ముద్దాడి మైమరచిన వైనం
నా పెదాల్లో చిక్కుకున్న నీ సన్నజాజి మాల

నీ సన్నని దేహాన్ని నా కౌగిట్లో బంధించి
ప్రపంచాన్ని కాజేసిన ఆనందం పొందినపుడు
నా మదిలో ఒదిగిపోయిన నీ మౌనం నా గేయమై
నా ఊపిరిలో లీనమై నీతో పంచుకున్నప్పుడు

కన్నీరే కార్చినా కరగనంత నీ ప్రేమ
కళ్ళలో దీపమై నాకు దారి చూపినపుడు
చిందిన అందాలన్నీ నా తప్పుని సరిదిద్ది
మనసులు ఊరట చెంది కలిసి నవ్విన క్షణం

ఇవన్నీ ఏ జన్మలోనివో , ఇప్పుడిలా కవ్వించి
నవ్వు దాచలేనన్ని కన్నీళ్ళని కలిగించినా
నువ్వు రావు, వస్తావని ఎదురుచూస్తూ ఉన్నా
మళ్ళీ బ్రదుకుదామన్న ఆశ చావక

24/02/2014

రామచంద్రుడితడు

"రామచంద్రుడితడు  " అనేది అద్భుతమైన కీర్తన.
రాముని  చుట్టుతా ఉన్న పాత్రలకు రాముడు ఎంతటి విలువైన వాడు అని చెప్పడం ఎంతో బాగుంటుంది.

రాముడు కామిత ఫలదాత , ఇందరికీ అనటం ప్రత్యేకం , ఎందుకంటే ఆయన అనంత శక్తి మంతుడు అని చెప్పటం అన్నమయ్య ఉద్దేశం

గౌతము భార్య - అహల్య పాలిటి కామధేనువు ట శ్రీరాముడు. కల్పవృక్షం కామధేనువు చింతామణి కోర్కెలు తీర్చేవి అని general meaning చెప్పుకున్నా , ఇక్కడ ధేనువు అనటంలో "వాత్సల్యం" (అంటే దూడ మీద ఆవుకి ఉండే looking after mentality )   ని చెప్పటం అన్నమయ్య గొప్పదనం. పైగా కల్పవృక్షం నీ దగ్గరకి రాదు (అది చెట్టు గనుక) అదే కామధేనువు ఆవు కాబట్టి నీ దగ్గరికి వచ్చి నిన్ను అనుగ్రహిస్తుంది. అందుకని అహల్య పాలిటి కామధేనువు.  

కౌశికునికి అంటే విశ్వామిత్రునికి కల్పవృక్షము - విశ్వామిత్రుడు రాముని దగ్గరకి వెళ్ళాడు. whereas రాముడు తాను స్వయంగా అహల్య దగ్గరికి వెళ్ళాడు. కానీ కోర్కెలు ఇద్దరికీ తీరాయి. రాముడు అహల్య దగ్గర mobility and nobility చూబించాడు -వాత్సల్యం చూబించాడు దానికి కారణం ఆమె కదలలేని స్థితి.  

సీతాదేవికి చింతామణి ట. ఆమెకీ కోర్కెలు తీరాయి. కానీ మణి అనేది essentially అలంకారం. సీతమ్మవారు హనుమంతునికి తన చూడామణి ఇచ్చి రామునికిది ఇవ్వు అనిందిట సుందరకాండ లో. అంటే అది వారిద్దరి ప్రేమకీ వారు పెట్టుకున్న గుర్తు. అది "సీతాదేవికి చింతామణి" అంటే అర్ధం. రెండోది రాముడ్ని తనకి అలంకరించుకునేంత
చనువు ఎవరికి ఉంటుంది సీతమ్మ కీ తప్ప ?

so కోర్కెలు తీరడం common అయినా అందులోనూ differences ఉన్నాయి. చెట్టుని వెత్తుకుంటూ వెళ్ళిన వాడికి ఆ చెట్టు ఎపుడూ అక్కడే ఉంటుందని తెలుసు. అంటే he can revisit. రాముడు విశ్వామిత్రుని దృష్టిలో స్థిరుడు ఆయన పరమాత్మ కాబట్టి .(చెట్టుకి నగము/అగము అంటే కదలనిది అని పేరు ఉంది కదా). he can find Rama once again. he can revisit. - అది కల్పవృక్షం అంటే

కానీ నిన్ను చూడటానికి వచ్చిన ఆవు వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ పట్టుకోవాలంటే ఎంతో కష్టపడాలి.  it is a one-time affair, a glimpse merely. - అది కామధేనువు అంటే

ఇంక నా నగ / అలంకారం నా దగ్గరే ఉంటుంది. that is my own . exclusive.అది చింతామణి అంటే

రాముడు దాసుల పాలిట లోకంలోనూ మోక్షంలోనూ కూడా దేవుడే. అంటే పై మూడు చరణాల్లో కోర్కెలు తీర్చే సాధనాలు చెప్పాడు కదా అని కేవలం ఈ లోకమే అనుకోవద్దు ఆయన పూర్ణ పరబ్రహ్మ అని నొక్కి వక్కాణించాడు.

ఈ రెండో చరణం ఇంకా చిత్రం గా ఉంది.

పరసుగ్రీవు పాలి పరమబంధుడితడు - పాపం సుగ్రీవునికి బంధువులే లేరు. ఉన్న ఒక్క అన్న తనని తన్ని తగలేసాడు. ఆయనకి రాముడు పరమబంధుడయాడు. తానె మిత్రుడిలా పెద్ద అన్నలా మారి ఓదార్చాడు.

సరి హనుమంతుని పాలి సామ్రాజ్యము - హనుమంతుడు యోగి , విరాగి. ఆయనికేమి పట్టవు . అన్ని శక్తులున్నా అవేమి తెలియని వెర్రివానివలే ఉన్నాడు. ఆయనకి సామ్రాజ్యం లభించినంత గొప్ప లభించింది రాముడి వల్ల. "రామ భక్తి సామ్రాజ్యం ఏ మానవునకు అబ్బెనో మనసా" అని త్యాగరాజస్వామి అన్నది హనుమ గురించేకదా . హనుమకి రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషేకం చేయటం కూడా కనిపిస్తుంది (అదొక పుణ్యతిథి) అదే ఇది.

నిరతి విభీషనుని పాలి నిధానము యితడు - పాపం విభీషణుడు పేద అయిపోయాడు. అన్న ఈతని బహిష్కరణ చేసాడు - తాను మహాభాగ్యవంతుడిని అనే అహంకారంతో. విభీషణునికి రావణుని దగ్గర ఉన్న నిధి మీద ఆశ లేదు పైగా అది పరధనం అని తెలుసు.  అలా వచ్చినవాడికి పెద్ద నిధి దొరికితే ? అది రామరక్ష అనే నిధి దాని వల్లనే ఆయన మళ్ళీ లంకా రాజ్యానికి రాజయ్యాడు కదా

నాల్గో పాదం పరమ చిత్రం .

గరిమ జనకు పాలి ఘనపారిజాతము -

అసలు సీతాకల్యాణంలో పరమ అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే జనకుడే. ఆయన మహావిష్ణువని తెలిసినది ముగ్గురికే - వశిష్టుడు విశ్వామిత్రుడు జనకుడు (రాజర్షి) కాబట్టి. మిగిలిన ఇద్దరూ గురువులు కాబట్టి ఆయనకి నమస్కారాలు చేయలేరు (లోక మర్యాదకి భిన్నంగా ) ఆయనే విష్ణువని తెలిసినా. వారు కేవలం ఆశీర్వదించగలరు. మిగిలినవారికి తెలియనే తెలియదు. జనకుడికి పట్టిన అదృష్టం ఏమిటంటే ఆయన కన్యాదానం అప్పుడు రాముని పాదాలు కడిగాడు. అది రామునికి నమస్కరించినట్టే కదా. పెళ్లి అంతా అయ్యాక రాముడికి మావగారి హోదాలో ఆయనని ఆశీర్వదించాడు కదా . ఈ రెండూ ఇంకెవరికైనా దొరికాయా? కేవలం జనకుడికే ఆ అదృష్టం. పారిజాతం అంటే కూడా దేవతా వృక్షమే. కానీ శరణాగతపారిజాత అనే ప్రయోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జనకుని విచిత్రమైన పరిస్థితికి, ఆయన చేసిన శరణాగతి కారణం అని అనిపిస్తుంది.

మరొక విచిత్రం - అసలు కోర్కెలే ఉడిగిపోయిన వాడు జనకుడు. వాళ్ళ వంశాన్ని దేశాన్ని కూడా "విదేహ" అంటారు. అంటే దేహ భ్రాంతి వదిలిపోయిన వారు అని. అటువంటివానికి కోరిక ఏమిటి అది తీర్చడం ఏమిటి? ఎంతటి యోగి అయినా ఏక కాలంలో అదే సందర్భంలో తాను నమస్కరించి తాను నమస్కారం అందుకునే అదృష్టం పడుతుందా ? అదే జనకుని కోరికేమో?

పైగా జనకుడు ఎక్కడా రాముడు దేవుడని బయటపడలేదు లోపల సంతోషించాడు తప్ప. ఇదే కదా వైరాగ్యం ఉంది అన్న వాడికి పరీక్ష . ఆ పరీక్షలో నెగ్గాడు జనకుడు అంటే అతనికి సాఫల్యం లభించినట్టే కదా.


తలప - ఆలోచించి చూడగా శబరికి ఇతను తత్వపు రహస్యమట !!! శబరికేమి రహస్యం తెలుసు కేవలం రామునికోసం ఎదురుచూడటం తప్ప? అదే రహస్యమేమో ? గురువు మాట మీద నమ్మకం తో ఓపికగా సాధన చెయ్యటమే తత్త్వ రహస్యం - అప్పుడు దేవుడు తనంత తానే ప్రత్యక్షమౌతాడు. ఇదే ఈ మాటకి అర్ధం అనుకోవచ్చు

అలరి గుహుని పాలి ఆది మూలము - అసలీ గుహుడు ఎవరు? అతను పడవ నడిపే వాడుకదా అతనికి రాముడెలా అంత మిత్రుడయ్యాడు?

విశ్వామిత్రుడు, జనకుడు వీరు బ్రహ్మర్షులు; అహల్య , శబరి తపస్సు చేసిన వారు; విభీషణుడు, సుగ్రీవుడు హనుమంతుడు కారణ జన్ములు భక్తులు; వీరికి రాముడు అందాడంటే అర్ధమయ్యాడంటే సరే . కానీ ఈ గుహుడు ఎవరు ? పడవనడిపే వాడికి రాజుగారి కొడుకు  అంటే భయం గౌరవం ఉంటాయి. పోనీ స్నేహం ఉండటానికి ఏమైనా అవకాశం ఉందా అంటే అదీ లేదు as far as i know (which is very little).

అది అతని సంస్కారం. అంతే. its inexplicable. ఆది మూలమైన జీవుని వేదన. ఇంత కంటే మరొక్కటి లేదు అనిపిస్తుంది.

కలడన్నవారిపాలి  కన్నులెదిటి మూరితి - అదేంటి ?ఇదింకా పరమాశ్చర్యం . కలడు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవారికి , నమ్మి చెప్పేవారికి ఇంక కనులెదుట ఎందుకు ? అంటే కలడు అన్నవారు ప్రపంచమంతా విష్ణుమయంగా చూస్తారు కదా. (అలా చూడగల్గడమే కలడు అని నిజంగా అనగలగటం). అలాంటి వారికి (ప్రహ్లాదుడు కలడు కలడు అని పదే పదే చెప్పాడు) ఆయన సర్వత్రా కనిపిస్తాడు కదా . పైగా అటువంటి వారే అర్చావతారమైన వేంకటేశుని చూచి అక్కడ ఉన్నది శిల్పం కాదు దేవుడు అని చెప్పగలరు కదా. అది దీని అర్ధం.

అలా అనగలిగిన వారికోసం వెలసిన వెంకటాద్రి విభుడు ఈ రాముడు. అంటే ఈయన పురాణపురుషుడు అనుకోకండి. ఎదుటనే ఉన్నాడు అని చెప్పడం అన్నమయ్య ఉద్దేశం.


lyrics and audio link                                            


                  


           

05/01/2014

శ్రీ శివమానస పూజా స్తోత్రం

శ్రీ శివమానస పూజా స్తోత్రం

రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం ఛ దివ్యామ్బరం
నానా రత్న విభూషితం మృగమదా2మోదాన్కితం చందనం
జాతీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ, ధూపం తథా 
దీపం దేవ! దయానిధే! పశుపతే!హృత్కల్పితం గృహ్యాతాం || 1 ||

పరమేశ్వరా! రత్నముల అమర్చిన సింహాసనం అమర్చాను, ఆసీనుడవు కమ్ము. చక్కని, చల్లని జలంతో స్నానం సమర్పిస్తున్నాను స్వీకరించు. దివ్యమైన శుభ్ర వస్త్రమిదే గ్రహించు. మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు, కస్తూరి (మృగమదం), చందనం యొక్క పరిమళం నీకు అందిస్తున్నాను. జాజిపూలు, సంపెంగపూలు, నీకు అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళాలు కూడిన పుష్ప సేవ, అగరు ధూపము స్వీకరించు. దేవా దీపం వెలిగించాను. ఇదంతా హృత్కల్పితం “మనసులో నేను కల్పించుకొన్నది” నేను మానస పూజే చేయగలను, ప్రత్యక్షపూజ చేయలేను, నీవు దయానిధివికదా, నా ఈ పూజ ని గ్రహించు.

సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే, ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం, పయోదధియుతం, రంభాఫలం, పానకం
శాకానామయుతం, జలం, రుచికరం, కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం, భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అని పంచోపచారాలు చెప్తారు కదా స్వామీ. ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తాను, మణులు పొదిగిన స్వర్ణ పాత్రలో , నెయ్యి, పాయసం, పంచభక్ష్యములూ (భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయాలు) ఎన్నో కూరలూ , అమర్చాను. పాలు, పెరుగూ, అరటి పండూ, మధ్య మధ్య రుచికరమైన పానకమూ, ఆరగించు స్వామీ. జలము తాగు. కొంత కర్పూరముంచిన తాంబూలము మనసుతో నిర్మించాను, స్వీకరించు దేవా.

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

భోజనానంతరం విహరిస్తావా స్వామీ , ఇదిగో ఛత్రం పడతాను ఎండ తగలకుండా, మధ్య మధ్య చామరం వీస్తాను, లీలా విహారం లో అందం చెడకుండా అడ్డం చూచుకోవయ్యా, మనోరంజనం కోసం వీణావాదన సమర్పిస్తున్నాను, తోడుగా భేరీ నినాదాలూ, మృదంగ తాళగతులూ, గానమూ నాట్యమూ నీకు రుచించుగాక, ఈ కళలన్నీ నీవే కదా, ఇవన్నీ నీకు సమర్పిస్తూ నీకు సాష్టాంగదండప్రణామం చేస్తున్నాను మనసులో. ఇది కళారూపాలతో చేసే ఈశ్వరార్చన.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

నేను నీకు బాహ్యపూజలు చేయలేని అజ్ఞుడను. నా ఆత్మయే నీవనుకో, నా బుద్ధి పార్వతీ దేవి గా భావించు. నా విషయ వాంఛలు, వాటి యందు నా అనుభూతులూ నీకు ప్రేమతో చేసే పూజలనుకో, నేను ఆదమరచి నిదురించినప్పుడు నీ ధ్యాననిష్ఠలో సమాధిమగ్నుడనయ్యాను అనుకో, నా వృధా పదగతులు నీకు ప్రదక్షిణలుగా, నా పిచ్చిప్రేలాపనలు నీ స్తోత్రపాఠాలుగా, నా కర్మసంచయమంతా నీ అర్చనగా పరిగణించి నన్ను కృతకృత్యుడ్ని చేయవయ్యా

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

సముద్రంలో నీరు అనంతం. అలాగే నీలో కరుణ అనంతం. సముద్రం పదే పదే అలలతో నన్ను తాకుతూనే ఉంటుంది, అదే విధంగా నీ కరుణకూడా నన్ను నిత్యం స్పర్శిస్తూనే ఉంటుంది. నా కరచరణాదికములతో, వాక్కుతో, దృక్ శ్రవణేంద్రియములతో, మనస్సులో, తెలిసీ తెలియక చేసిన మహాపరాధాలనన్నింటినీ, పెద్ద మనసుతో క్షమించమని కరుణాసముద్రుడవైన నిన్ను వేడుకుంటున్నాను.

10/04/2013

అన్వేషణ


సూర్యుడు పూవులా ఉదయిస్తాడు , కాలం తేనే లా చిమ్ముతూ పైకొస్తుంది.
ఒక్కో క్షణం ఒక్కో అనుభూతిని మనకందించి, మనం తేరుకుని చూసేలోపు మాయమయిపోతుంది.

అందుకే జీవితం చాలా విలువైనది, కారణం అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియని అందమైన గాజు బొమ్మ.
మనం ఏమరపాటు లో ఉండిపోతే, ఏదో ఓకే క్షణం, తన వెంట మృత్యువుని తీసుకోచ్చేస్తుంది. ఆ పై మనం చదవాల్సిన కవిత్వం, చేయాల్సిన పనులూ, వినాల్సిన పాటలు, అన్నిటికంటే మించి, ప్రేమించాల్సిన మనుషులూ క్షణాలూ, వీటన్నిటినీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది.

ప్రత్యూష సమయంలో దేవతార్చన,
భాస్కరుని జాడలో పుస్తకపఠనం,
సాయంవేళల చల్లని పలకరింత,
వెన్నెల నీడలో ప్రియ సంగమం,

ఇవన్నీ వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోవాల్సి ఉంటుంది.
మళ్ళీ మళ్ళీ మనకు దేవుడూ, మనుషులూ దొరకరు, పూజించటానికీ, ప్రేమించడానికీ.

ఇతరులు మనకి నీళ్లొదులుతుంటే, మనం కన్నీళ్లోదులుతూ వారిని విడిచిపెట్టెయ్యాలి.
అందుకే... అందుకే ఈ క్షణం నుండీ ఏ క్షణం వృధా చేయకు.
నష్టమయిన క్షణాలన్నీ ఇసుక రేణువులై కాల మహాసముద్రపు ఒడ్డున పడున్నాయి.
కెరటమంత జీవితంలో క్షణమైనా సుఖం ఉంది,
ఆ క్షణం కోసం జన్మంతా వెతికితే బాగుంటుంది.


29/01/2013

అన్నమయ్య గురించి వేటూరి

వేటూరి పాట :

నాకు తెలిసినంత వరకూ, పాటంటే అన్నమయ్య, తరవాత వేటూరి.
"అన్నమయ్య" అని రాసిన వాక్యంలోనే వేటూరి అని రాయడం (english లో చెప్పాలంటే taking annamayya's name in the same breath as veturi) సాహితీ పరులు, సినిమా పాటలని ఎరిగిన వారు నన్ను తప్పు పడతారని నాకు తెలుసు.

కాకపొతే, ఇది వారిద్దరూ సమానులని చెప్పటం కాదు.వారిద్దరి పాటాలూ నన్నాకర్షించాయి అని. మనలో చాలా మందికి రాముడూ ఇష్టమే , రామారావూ ఇష్టమే. అలాగని వారిద్దరని equate చేసినట్లా?

పోలిక ఎందుకు తెచ్చినా, సరైన పోలిక తట్టింది.రామారావు రాముడ్ని మనందరికీ గుర్తు చేసాడు. రాముడంటే ఇలాగే ఉంటాడని అనిపించాడు. కానీ, రాముడు కాని (అంటే వాల్మీకి రాముడు కాని) ఎన్నో పాత్రలనూ అంతే సుళువుగా, అంత కన్నా successfulగా పోషించాడు.

వేటూరి కూడా, అన్నమయ్య సాహిత్యం లో ఉండే లక్షణాలని నా వంటి వారికి పరిచయం చేసాడు, చదువుకున్న వారికి గుర్తుకు తెచ్చాడు. అదే శైలిలో మాత్రమె రాయకుండా, ఇంకా ఎన్నో భిన్నమైన, అందమయిన  పాటలూ, పాట అనడానికి అర్హతలేని ఎన్నో fill in the blanks చేసాడు.

రామారావు రాముడి గురించి ఏమన్నాడో మనకు తెలియదు. కానీ వేటూరి అన్నమయ్య గురించి ఏమన్నాడో మనకు తెలుసు. అదే ఈ పాట

తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం ||

అరిషడ్వర్గము తెగనరికే, హరి ఖడ్గం ఇది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాస్శీస్సులు పొందినదై
శివలొకమ్మున చిద్విలాసమున డమరు ధ్వనిలో గమకితమై
దివ్య సభలలో భవ్య నాట్యముల పూబంతుల చేమంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి 
సితహిమ కంధర యతిరాట్ సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించె ఆ నందకము - నందనానంద కారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం ||

పద్మాసనుడే ఉసురు పోయగా, పద్మావతియే పురుడు పోయగా,
విష్ణు తేజమై, నాదబీజమై, ఆంధ్ర సాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయా అసతోమా సద్గమయా
అవతరించెను అన్నమయా అసతోమా సద్గమయా ||

పాపడుగా నట్టింట పారుతూ భాగవతము చేపట్టెనయా
హరి నామమ్మును ఆలకించక అర ముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతౌ ఎదలయ లో పదకవితలు కలయ
తాళ్ళపాక లో ఎదిగే అన్నమయ తమసోమా జ్యోతిర్గమయా ||

అన్నమయ్య సాహిత్యాన్ని వెలికి తీసుకు రావటం లో ప్రముఖ పాత్ర వహించిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తమ్ముడు కొడుకు అవటం వల్ల సుందరరామ్మూర్తి ఈ పాట ఇంత  గొప్పగా రాసాడా? అయ్యుండచ్చు. కానీ ఈ పాటని అన్నమయ్య scholar తమ్ముడి కొడుకుగా రాయలేదేమో అనిపిస్తుంది. తన పాటకులానికి తొలి గురువయిన వాడిపై తనది గొప్ప లేక చెప్పుకోతగ్గ  creativity అనే అహంభావాన్ని విడిచిపెట్టి, కేవలం, ఒక భక్తుడిగా , భక్తుడి భక్తుడి గా, ఒక పరిశీలకుడిగా అన్నమయ్య పాటలో , పలుకుబడిలో, భక్తిలో, భావనలో ఉన్న మాధుర్యాలకి కారణాలు వెతుకుతున్న ఒక సాహిత్య ఉపాసకుడిగా ఈ పాట రాశాడు వేటూరి.

అన్నమయ్య పాటలో ప్రతిభకీ వ్యుత్పత్తికీ ఉన్న అన్యోన్యత ఎలా వచ్చింది? లయ, గమకం ఎలా చేరింది? అతి లావణ్యమాయమైన కులుకూ, నిరంతరమూ హరి గానమే చేసే అనురక్తి, నాదశక్తి ఎలా సమకూరాయి? తపోవేదనా, ఆ వేదన లోంచి వచ్చే మంత్రం లాంటి మాట ఎలా వచ్చి కలిసాయి?

అన్నమయ్య విష్ణు మూర్తి ఖడ్గం అయిన "నందకం" అంటారు శ్రీవైష్ణవ సంప్రదాయము వారు. బహుశా ఆ ఖడ్గం భూమిపై అవతరించడానికి వస్తున్నప్పుడు సత్యలోకం గుండా వచ్చిందేమో, అందుకే సత్యలోకం లో ఉన్న బ్రహ్మాసరస్వతుల అనోన్యత ఆ ఖడ్గంలో ఒదిగిపోయింది. శివుడు అద్భుతంగా తాండవం ఆడుతుండగా అటుగా వస్తూ ఆ తాండవం లోని గమకం గ్రహించింది. ఇంద్ర సభలో నాట్య మాడుతున్న అప్సరసల కులుకులూ ఓడిసిపట్టిందేమో. హరిని  పొగడడానికే అవతరించిన నారదుల వారి మార్గాన పోతూ ఆ నారదుని హరి భక్తి, నాద స్ఫూర్తి గ్రహించిందేమో, హిమాలయ సిద్ధ భూములలో పరమాత్మ సందర్శనానికి పరితపించిన ఋషుల మనోభావాలు  అనుభూతి చెందింది. అయినా అది సహజంగా హరి ఖడ్గం. కామo , క్రోధo , లోభo  మోహo , మదo  మాత్సర్యం అనే లోపలి శత్రువులని తెగనరకటం దాని పని. అందుకే ఇన్ని అందాలను తనలో, తన కవిత్వంలో ఇముడ్చుకున్న మహానుభావునిగా జన్మనొందడానికి లక్కమాంబలోకి ప్రవేశించింది. ఆమె పుణ్య వనిత. అందుకే  ఆమెది గర్భాశయము కాదు గర్భాలయము!

అన్నమయ్య పుడుతుంటే ఎవరు పురుడు పోశారో? సాక్షాత్తు పద్మావతి దేవి, తనపై వయారంగా, చనువుగా శృంగార కీర్తనలు రాసే వాడిని ఈ లోకంలోకి తీసుకువచ్చిందేమో.
అది ఖడ్గం కాదు, విష్ణు తేజమే. ఒక్క సంకీర్తనే చాలు అనే రీతిలో వెలసిన 32 వేల సంకీర్తనల మహా కల్పతరువుకి నాదబీజం. (సంస్కృత భాషకి lexicon) అమరకోశం లాగా అన్ని పదాలనీ, అన్ని విషయాలనీ స్పృశిoచేది, ఆంద్ర భాషకు అమరత్వాన్ని కలిగించినది.

అన్నప్రాసన నాడు డబ్బులూ, పుస్తకం, కత్తి,  వంటివి పెట్టి ముచ్చట చేస్తే ఈ అన్నమయ్య ఏమి చేపట్టాడో? యితడు ప్రహ్లాదుడంతటి భక్తుడు!!! భాగవతం చేపట్టి ఉంటాడు. ధర్మాన్నీ, జ్ఞానాన్ని అతి రమ్యంగా , రుచిగా చెప్పిన భాగవతం నా కీర్తనలకి మార్గదర్శకము అని అప్పుడే చెప్పాడా? ఈతడు తెలుగు సరస్వతికి ఆరిపోని హారతి. అతని గుండెసడిలో కూడా పదకవిత వెల్లువయ్యేలా అన్నమయ్య తాళ్ళపాక వారి భాగ్యమై, కాదు కాదు ఈ తెలుగు జాతినే అంధకారంలోంచి కాంతి లోకి, అజ్ఞానం లోంచి జ్ఞానం వైపుకి  నడిపించే మార్గమై వెలిసాడు.

అన్నమయ్య గురించి పాట అనగానే   ఇన్ని అనుభూతులు కదిలి రాసిన ఒక scribe లాగా, సమీక్షకుడి లాగా రాసిన వాడు వేటూరి. 

ఇంతటి గొప్ప పాట రాయగలిగే అవకాశం, superhit commercial director సినిమా లో రావటం ఒక విచిత్రం!
వేటూరి తెలుగు పాటని భ్రష్టుపట్టించాడనే  వారికి ఒక  ప్రశ్న. 1976 లో commercial పాట రాయను అని వేటూరి అనుంటే, 1996 లో ఈ పాట రాయగలిగే అవకాశం అతనికి
వచ్చేదా?

వేటూరి జన్మదినం సందర్భంగా   ఆయనలోని సాహిత్యారాధకునికి  ఇది నా నివాళి !!!





16/01/2013

Column:

Column రాయాలా వద్దా? కాలం రాయడానికి నేను గొల్లపూడి మారుతీ రావునో, శ్రీ రమణనో, పురాణం సీతనో కాదు. (నాకు తెలిసిన కాలమిస్ట్ లు వీరే). పొతే కాలం రాయాలంటే న్యూసు రోజు చదవాలి, దాన్ని విశ్లేషించే అనుభవమో, పరిణితో, education ఓ ఉండాలి. మనకి అవన్నీ లేవు. కాని "ఇత్యేషా మనీషా మమ" అనేది ప్రతి వారికీ ఉంటుంది. పైగా నాకు "Rem acu tetigisti" *  అని ఒక కాలం రాయాలని నాకు 2007 లోనే అనిపించింది. కాబట్టి ఇన్ని రోజులకి ఇది మొదలుపెడుతున్నా. దీనికి కాలం కి పోలికలు రెండు 1.Periodicity 2.Written by the same author. అంతే. ఇక పొతే నాకు ఏ విషయం గురించి ప్రస్తావించాలి అనిపిస్తే దాని గురించి ప్రస్తావిస్తాను.

ఇవాళ్టి విషయం:

O.Henry రాసిన The Skylight room

O.Henry గా పేరు పొందిన William Sydney Porter గొప్ప కథకుడిగా పేరు తెచ్చుకున్న American. కథలో చలాకీతనం, హాస్యం, చివరన "twist", ఈతని కథల్లో పట్టుకోదగ్గ, చెప్పుకోదగ్గ విశేషాలలో ముఖ్యమైనవి.

డాక్టరో, డెంటిస్ట్ ఓ ఉండతగిన, మొదటి అంతస్తునీ, 8 డాలర్లు అద్దె ఉన్న రెండో అంతస్తునీ, చూసి నా బడ్జెట్ ఇంతకన్నా (చాలా) తక్కువ అనే వారిని చులకన గా చూసే Mrs. Parker, 3వ అంతస్తు లో ఉన్న(అద్దె సరిగ్గా కట్టని) నాటక రచయితని బెదరగొట్టడానికి అదీ చూబించి, అదీ తీసుకోలేను అంటే, "Clara" అని పనమ్మాయిని అరిచి (పిలిచి) 4వ అంతస్తులోని Skylight room చూబించమని చెబుతుంది. చుట్టూ store rooms ఉన్న చిన్న కొట్టం లాంటి గదిలో, ఆకాశాన్ని చూపే ఒకే ఒక కిటికీ. O.Henry మాటల్లో Through the glass of the little skylight you see a square of blue infinity.

ఇలాగే ఆ రూముని అద్దెకు తీసుకున్న Miss Leeson, the funniest and jolliest ever అని ఆ ఇంట్లో ఉండే అందరి మగవాళ్ళ చేతా పొగడబడిన Miss Leeson ఆఫీసులకి వెళ్లి, చేతి రాత లో ఉన్న నోట్స్ తీసుకువచ్చి, వాటిని టైపు చేసి పెట్టే freelance typist.ఎన్నో ఊహలు, ఆశలు నింపుకున్న ఆమెకు skylight లోంచి రోజు కనబడే నక్షత్రమే తోడు. మిత్రుడు. దానికి Billy Jackson అని పేరు పెట్టుకుని, ఒక ఆప్తుడ్ని పిలుచుకున్నట్టు ఆప్యాయంగా పిలుచుకుంటుంది, ఆ నక్షత్రం ఏ constellation లోది , దాని పేరేమిటి అనేవి తెలియకపోయినా.

ఇదిలా ఉండగా, కొన్ని రోజులుగా పనిలేక తద్వారా ఆహారం లేక పక్క మీద వాలిపోయిన Miss Leeson, Billy Jackson ని చూసి ఒక flying kiss ఇచ్చి, నాకు ఎన్నో లక్షల మైళ్ళ దూరంలో ఉన్నా, నాకు ఎప్పుడూ కనబడుతూ నాకు వెలుగుని పంచావు.Bye Billy Jackson అంటూ కుప్ప కూలిపోయింది.

మర్నాడు, పది గంటలయినా తలుపు తీయలేదని కంగారుపడిన Clara, చాలా రకాలుగా Miss Leeson ని revive చెయ్యటానికి ప్రయత్నించి, చివరికి ambulance ని పిలిచింది. డాక్టర్ హడావిడి గా పరిగెత్తుకొచ్చి, Miss Leeson ని ఎత్తుకుని గబగబా తీసుకెళ్ళాడు.

తరువాత ఏమయ్యింది? మర్నాడు పేపర్లో  starvation వల్ల సొమ్మసిల్లిన అమ్మాయి కోలుకుంటుంది అని ambulance physician ""Dr. William Jackson"" తెలిపారు అనే వార్త వచ్చింది.

@@@@@

ఆశ అనేది ఎంత చిన్నదైనా, ఎంత సిల్లీ గా కనిపించినా, లాజిక్ కి ఎంత మాత్రమూ అందనిదైనా , ఆ ఆశ చాలా ఆశ్చర్యంగా, ఆత్మీయం గా, మనిషిని రక్షిస్తుంది - మనం ఊహించలేనంత miraculous గా. ఇదీ ఈ కథకు premise. ఇంచుమించుగా ఇదే మూల సూత్రం తీసుకుని O.Henry రాసిన ఇంకో కథ The Last Leaf.

The Skylight room

The Last Leaf