Pages

26/03/2016

అన్నమయ్య భక్తి - త్యాగరాజస్వామి సాధన

నా బ్లాగ్ లో "రామచంద్రుడితడు..." మీద రాసుకున్న notes ని మిత్రులు ఫణీంద్ర గారు Facebook లో share చేస్తే ఒకాయన comment పెట్టారు, అసలు అన్నమయ్య కి త్యాగరాజస్వామి కి పోలికలు ఎవరైనా చెబితే బాగుంటుంది అన్నారు. అది చేసే స్థాయి ఏ మాత్రం లేకపోయినా.... చెరువులో రాయి వేస్తే అలలు కదిలినట్టు నా లో ఏదో కదలిక ...
ఇక్కడ రాసినదంతా నా అతి పరిమిత దృష్టికి స్ఫురించినవే... తప్పులుంటే మన్నించండి...

  త్యాగరాజస్వామి కీర్తనలలో ఒక మార్దవం అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది... ఆయన ప్రధానంగా ఒక సాధకుని వలే కనిపిస్తారు. రాముని ఉపాసించడం... తద్వారా తరించడం.... ఆయనకి తెలిసినవి ఇవే .. ప్రతి కీర్తనా ఆయన తన సాధనకోసం రాసుకున్నది అనిపిస్తుంది, ధ్యానం చేసుకునే సమయములో  ఆత్మ విచారణ లోంచి వచ్చిన మాటల్లా అనిపిస్తాయి "రామ భక్తి సామ్రాజ్యం , ఏ మానవులకు అబ్బెనో మనసా.." అన్న చోట ఒక భక్తుడిగా తను నడుస్తున్న దారిలో మార్గదర్శకులైన వారిని భావిస్తూ , వారి సందర్శనం అత్యంత బ్రహ్మానన్దమే అంటారు.. అట్టి మహనీయుల అనుసరణ, కృప కావాలి కదా అని మనసుకి చెప్పుకుంటున్నారు. మరో చోట రాముని ధ్యానిస్తూ "ఎవరని నిర్ణయించిరి రా , నిన్నే ఎట్లా ఆరాధించిరిరా " అంటారు.. రాముని నిజ స్వరూప స్వభావాలకై అన్వేషణ అందులో కనిపిస్తుంది. "వందనము రఘునందనా " అన్న చోట ఒక నమస్కారముతో పాటు ఒక చిన్న వేడుకోలు కనిపిస్తుంది [శ్రీదమా నాతొ వాదమా , నే భేదమా , ఇది మోదమా ?]. ఆ ఆర్తిలో కూడా లాలిత్యం ఉంది.

రాముని గుణములలో ఒక అంశాన్ని స్పృశిస్తూ, అది హృదయానికి హత్తుకునేలా చెప్పుకోవడం
"రామ నీ సమానమెవరు ?.. పలుకు పలుకులకు తేనెలొలుకు మాటలాడు సోదరులు గల హరి, త్యాగరాజ కుల విభూష , మృదు సుభాష! రామా!" 
అంటూ రామా అన్నప్పుడు అందులో ఉన్న స్వారస్యాన్ని అనుభవించడం ఆయన లక్షణం.
"అలకలల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో " అన్న చోట సుకుమారమైన రాముని రూపధ్యానం .. "వాచామగోచారమే మనసా వర్ణింప తరమే వాని మహిమ" అంటూ రామ పారవశ్యం లోకి కలిసిపోవడం..."తులసీ బిల్వ మల్లికాది జలజ సుమముల పూజలు గైకొనవే ..." అన్న కీర్తనలో  "కరుణతో నెనరుతో పరమానందముతో  నిరతమును శ్రీ త్యాగరాజు నిరుపాధికుడై అర్చించు " అంటూ తన అనుష్ఠానరీతి పాట ద్వారా వ్యక్తపరచడం ఆయన లక్షణం.
మరో చోట "శ్రీ రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే" అంటూ రామ పాదస్పర్శ కోసం ఎదురు చూస్తూ, ఆ నిరీక్షణలోనే ఆనందాన్ని అనుభవిస్తూ ప్రేమ భక్తి తత్త్వం ప్రకటింపజేస్తారు.

"నా జీవాధారా, నా నోము ఫలమా , రాజీవ లోచనా , రాజరాజ శిరోమణి , 
నా చూపు ప్రకాశమా నా నాసికా పరిమళమా నా జపవర్ణ రూపమా నాదు  పూజా సుమమా త్యాగరాజనుతా"  ఆత్మానుసంధానం రామునితో ... తనలోని అణువణువూ, తన సాధన సంపత్తి యావత్తూ, తన జపించే మంత్ర రూపమై తనలోనే తనతోనే నిరంతరం సంచరించే రాముని ధ్యానం , రామునిలో సంగమం ... ఇవన్నీ ఆయన లక్షణాలు.

ఆ రకంగా త్యాగరాజస్వామి వారు, వారి కవిత్వం ఆత్మాశ్రయం గా ఉంటాయి అనిపిస్తుంది. (ఇంగ్లిష్ లో చెప్పాలి అంటే) he's an introvert.

అన్నమయ్య సాధకుని వలే కనిపించడు.. అతడు ఎనిమిదేళ్ళకే శ్రీనివాసుని దర్శనం పొందిన వాడు. అన్నమయ్య కి వర్ణన ఎక్కువ ప్రీతిపాత్రం గా అనిపిస్తుంది.. ఏదైనా ఒక వస్తువు, విషయం, క్షేత్రం, అవతారం, తత్వం తీసుకున్నా దాన్ని ఎదుటివారికి ఎంత బాగా చెప్పాలి, ఎలా వర్ణించాలి, ఎంత వ్యాప్తి చెయ్యాలి అన్న ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది. దానికి తగ్గట్టు గానే ప్రతీ కీర్తన లోనూ మూడు చరణాలు తప్పనిసరిగా ఉంటాయి, ఆయన అనుకున్న విషయ విస్తృతి కి ఒదిగేలా. త్యాగరాజస్వామి వారి కీర్తనలు (ఘనరాగ పంచరత్నాలు వదిలేస్తే) ఒక పల్లవి, ఒక అనుపల్లవి, ఒకటో రెండో చిన్న చరణాలు ఉంటాయి. అన్నమయ్యకి విషయం చెప్పడం ప్రధానం, త్యాగరాజస్వామి కి నాదాన్ని base గా, ఆధారంగా తీస్కుని meditate చెయ్యడం, ధ్యానించడం ముఖ్యోద్దేశం.   

అన్నమయ్య ఒక extrovert..

అతనిలో ఎన్నో వైవిధ్యమైన భావాలు, ఉద్వేగాలు ఉన్నాయి.

అతడు ఒక సారి యశోద అయిపోతాడు. 
"ఇట్టి ముద్దులాడి బాలుడేడ వాడు ? వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే " , {ఇట్టిముద్దులాడి}
"బలుపైన పొట్ట మీది పాల చారలతోడ , నులి వేడి వెన్న తిన్న నోటి తోడ 
చెలగి నేడిదే వచ్చి శ్రీ వెంకటాద్రి పై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు" {చిన్న శిశువు} 

ఒకో సారి తీర్ధయాత్ర పరుడై కనిపిస్తాడు
"కలశా పురముకాడ కందువ చేసికొని " అని హనుమంతుని, "..పొంచి విజయనగరాన ఆదికి అనాదియైన అర్చావతారాము "{రాముడు రాఘవుడు } అని రాముని, "కదిరి నృసింహుడు కంబమున వెడలే , విదితముగా సేవింపరో మునులు" అని నృసింహుని వర్ణిస్తాడు. నిజానికి ఈ లక్షణం కొంచెం త్యాగరాజస్వామి లో కూడా కనిపిస్తుంది. "...నిర్జరులను తారకలలో  చంద్రుడవై వెలుగుదువట.. వరదరాజ నిన్నేకోరి వచ్చితిరా " అంటూ కంచి పెరుమాళ్ని "తెర తీయగా రాదా , తిరుపతి వెంకట రమణా.." అంటూ బాలాజీని దర్శించి కీర్తించారు. కానీ ఆయన తన రామపంచాయతనం అదృశ్యమైనప్పుడే తిరువయ్యారు వదిలి బయటకు వచ్చారు క్షేత్ర యాత్రకి. కొద్ది రోజులలో వెనక్కి వెళ్ళిపోయారు. కానీ అన్నమయ్య తన జీవిత కాలంలో ఎన్నో పర్యాయాలు తీర్థయాత్రలు చేసినట్టు, దర్శించిన ప్రతి దేవతనూ వేంకటేశ్వరుని తో అనుసంధించి కీర్తించినట్టు పెద్దలు చెబుతారు. సంఖ్యాపరంగా చూసినా అన్నమయ్య రాసిన క్షేత్రదేవతల కీర్తనలు మిక్కిలిగా కనిపిస్తాయి.

ఒక్కోసారి శ్రీనివాసుని అర్చకస్వామిలా కనిపిస్తాడు అన్నమయ్య.
శ్రీ వారికి జరిగే సేవలను వర్ణిస్తాడు "షోడశ కళానిధికి షోడశోపచారములు, జాడతోడ నిచ్చలును సమర్పయామి" "కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేల్మంగ అండనుండే స్వామికి " అంటూ
బ్రహ్మోత్సవాలను, వాహనవిశేషాలను "భోగీంద్రులును మీరు పోయిరండు" "...మురిసేను మూడోనాడు ముత్యాల పందిరికింద ... వనితల నడుమను వాహనాల మీదను .. తిరువీధుల మెరసీ దేవదేవుడు" "తిరువీధులేగీనే.." అంటూ పేర్కొంటాడు.
తిరుమల కొండనూ, యాత్రికుల మార్గాన్ని, తిరుమల స్వామిని సేవించిన భక్తులను వర్ణిస్తాడు
"కట్టెదుటా వైకుంఠము కాణాచైన కొండ.." "అదివో అల్లదివో శ్రీ హరి వాసము" "కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు"

ఒక్కోసారి కలిలో నామస్మరణ తప్ప తరించేందుకు మార్గం లేదని ఉద్బోధించడానికి భజనలు, నామకీర్తనలు చెబుతాడు "చాలదా హరినామసౌఖ్యామృతము" "మాధవా, కేశవా, మధుసూదనా" "నారాయణ తే నమో నమో" "జయ జయ నృసింహ సర్వేశ" 

శ్రీనివాసునకు, అలమేలుమంగకు అనుంగు చెలికానిగా హరి శృంగారాన్నిమధురమధురంగా వర్ణిస్తాడు "పలుకు తేనెల తల్లి పవళించెను" "ఏమొకో చిగురుటధరమున.." "ఆణికాడవట అంతటికి.." ఒక కీర్తన (పల్లవి గుర్తురావట్లేదు) లో స్వామి వారితో అలమేల్మంగ అంటే అసూయ ఉందా అన్నట్టు మాట్లాడతాడు .. ఆమె కురులు చిక్కు తీసి జడవేస్తావు , నా చిక్కులు తీర్చమంటే తీర్చవు అని

కానీ, తీవ్రమైన విరక్తికి గురై వైరాగ్య భావాలతో సతమతమౌతాడు "పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలోన నాయందు మంచితనమేది"  అని. నిజానికి ఈ నైచ్యానుసంధానం భక్తులలో కనిపిస్తూ ఉంటుంది. త్యాగరాజస్వామి కూడా "ఎటుల బ్రోతువో తెలియ ఏకాంత రామయ్య , కటకటా నా చరితము కర్ణకఠోరమయ్యా" అన్నారు. కానీ అందులో తీవ్రత కనబడదు. "మనసా ఎటులోర్తునే .." అన్నా "అనురాగము లేని మనమున సుజ్ఞానము రాదు" అన్నా వారి వైరాగ్యములో కూడా శాంతము కనబడుతుంది. మనసులో బేరీజు వీసుకునే తీరు కనబడుతుంది.
అదే అన్నమయ్య లో తీవ్రత, ఒక రకమైన నైరాశ్యము కనబడతాయి. "దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయఁ ఓపక కదా నన్నునొడబరకుచు , పైపైనే సంసార బంధములకట్టీవు , నా పలుకు చెల్లునా నారాయణా " {నిగమ నిగమాంత} ఈ మాట అన్న చోట దేవుడు కావాలని తనని సంసారంలో తిప్పుతున్నాడు అన్న నిష్ఠురం, మనకి నైరాశ్యం గా కనిపిస్తుంది. "ఎన్నడు విజ్ఞానమిక నాకు... కోసిన తొలగవు కోరికలు ఈ గాసిలి చిత్తము కలిగిన్నన్నాళ్ళు" "ఏది తుద ? దేనికేది మొదలు ?పాదుకొను హరిమాయ పరగు జీవులకు"  "...నిచ్చలు నిచ్చలు నెయ్యములు, రచ్చల వెంకటరమణుని కొల్వక చచ్చియు చావని జన్మములు.." {వననిధి కురిసిన వానలివి}.

ఇంతలో మురిపెమైన జానపద శైలి "ఏలే ఏలే మరదలా .." "జాణతనాలాడేవేలే జంపు గోల్లెతా .." వాటి నిండా చిలిపి పదప్రయోగాలు, అంతలో గంభీరమైన సంస్కృత పాటవము "ప్రళయ మారుత ఘోర భస్త్రికాఫూత్కార చలిత నిశ్వాశ డోలా రచనయా కులశైల కుమ్భినీ కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహా "{ఫాలనేత్రానల}
కనిపిస్తాయి అన్నమయ్యలో. ఇంత వైవిధ్యము, ఇన్ని moods, ఇన్ని shades అన్నమయ్య లో కనిపిస్తాయి.

త్యాగరాజస్వామి కీర్తనలలో కూడా
యోచనలు, దువిధలు "నిధి చాల సుఖమా.. రాముని సన్నిధి సేవ సుఖమా "
వేదనలు   "భవము వేరు చేసితినని నాడు పై పలికేరు నరులు "
దేవునికై వెదుకులాట "మరుగేలరా ఓ రాఘవా .." "నగుమోము కనలేని నా జాలి తెలిసీ "
ఇన్ని రకాల వైవిధ్యాలు ఉన్నా, వాటి నిర్మాణ శిల్పం వల్ల అదంతా ఆత్మైక్యం కోసం చేసే సాధన లో భాగమై విచారణ, చింతన గా కనిపిస్తాయి.

చివరిగా

త్యాగరాజస్వామి వారి భక్తి తంజావూరు నేలలోని కావేరీ.  ప్రశాంతంగా, గంభీరంగా పారుతుంది.
అన్నమయ్య భక్తి శేషాచలం మీంచి కిందికి దూకే కపిలతీర్థం జలపాతం. వేగమూ, ఉద్వేగమూ ఎక్కువ.




_/\_ వల్లభజోస్యుల నళినీకాంత్    
















No comments:

Post a Comment