Pages

29/01/2013

అన్నమయ్య గురించి వేటూరి

వేటూరి పాట :

నాకు తెలిసినంత వరకూ, పాటంటే అన్నమయ్య, తరవాత వేటూరి.
"అన్నమయ్య" అని రాసిన వాక్యంలోనే వేటూరి అని రాయడం (english లో చెప్పాలంటే taking annamayya's name in the same breath as veturi) సాహితీ పరులు, సినిమా పాటలని ఎరిగిన వారు నన్ను తప్పు పడతారని నాకు తెలుసు.

కాకపొతే, ఇది వారిద్దరూ సమానులని చెప్పటం కాదు.వారిద్దరి పాటాలూ నన్నాకర్షించాయి అని. మనలో చాలా మందికి రాముడూ ఇష్టమే , రామారావూ ఇష్టమే. అలాగని వారిద్దరని equate చేసినట్లా?

పోలిక ఎందుకు తెచ్చినా, సరైన పోలిక తట్టింది.రామారావు రాముడ్ని మనందరికీ గుర్తు చేసాడు. రాముడంటే ఇలాగే ఉంటాడని అనిపించాడు. కానీ, రాముడు కాని (అంటే వాల్మీకి రాముడు కాని) ఎన్నో పాత్రలనూ అంతే సుళువుగా, అంత కన్నా successfulగా పోషించాడు.

వేటూరి కూడా, అన్నమయ్య సాహిత్యం లో ఉండే లక్షణాలని నా వంటి వారికి పరిచయం చేసాడు, చదువుకున్న వారికి గుర్తుకు తెచ్చాడు. అదే శైలిలో మాత్రమె రాయకుండా, ఇంకా ఎన్నో భిన్నమైన, అందమయిన  పాటలూ, పాట అనడానికి అర్హతలేని ఎన్నో fill in the blanks చేసాడు.

రామారావు రాముడి గురించి ఏమన్నాడో మనకు తెలియదు. కానీ వేటూరి అన్నమయ్య గురించి ఏమన్నాడో మనకు తెలుసు. అదే ఈ పాట

తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జ్ఞానపథం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం ||

అరిషడ్వర్గము తెగనరికే, హరి ఖడ్గం ఇది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాస్శీస్సులు పొందినదై
శివలొకమ్మున చిద్విలాసమున డమరు ధ్వనిలో గమకితమై
దివ్య సభలలో భవ్య నాట్యముల పూబంతుల చేమంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతీ గానపు మహిమలు తెలిసి 
సితహిమ కంధర యతిరాట్ సభలో తపః ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించె ఆ నందకము - నందనానంద కారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం ||

పద్మాసనుడే ఉసురు పోయగా, పద్మావతియే పురుడు పోయగా,
విష్ణు తేజమై, నాదబీజమై, ఆంధ్ర సాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయా అసతోమా సద్గమయా
అవతరించెను అన్నమయా అసతోమా సద్గమయా ||

పాపడుగా నట్టింట పారుతూ భాగవతము చేపట్టెనయా
హరి నామమ్మును ఆలకించక అర ముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతౌ ఎదలయ లో పదకవితలు కలయ
తాళ్ళపాక లో ఎదిగే అన్నమయ తమసోమా జ్యోతిర్గమయా ||

అన్నమయ్య సాహిత్యాన్ని వెలికి తీసుకు రావటం లో ప్రముఖ పాత్ర వహించిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తమ్ముడు కొడుకు అవటం వల్ల సుందరరామ్మూర్తి ఈ పాట ఇంత  గొప్పగా రాసాడా? అయ్యుండచ్చు. కానీ ఈ పాటని అన్నమయ్య scholar తమ్ముడి కొడుకుగా రాయలేదేమో అనిపిస్తుంది. తన పాటకులానికి తొలి గురువయిన వాడిపై తనది గొప్ప లేక చెప్పుకోతగ్గ  creativity అనే అహంభావాన్ని విడిచిపెట్టి, కేవలం, ఒక భక్తుడిగా , భక్తుడి భక్తుడి గా, ఒక పరిశీలకుడిగా అన్నమయ్య పాటలో , పలుకుబడిలో, భక్తిలో, భావనలో ఉన్న మాధుర్యాలకి కారణాలు వెతుకుతున్న ఒక సాహిత్య ఉపాసకుడిగా ఈ పాట రాశాడు వేటూరి.

అన్నమయ్య పాటలో ప్రతిభకీ వ్యుత్పత్తికీ ఉన్న అన్యోన్యత ఎలా వచ్చింది? లయ, గమకం ఎలా చేరింది? అతి లావణ్యమాయమైన కులుకూ, నిరంతరమూ హరి గానమే చేసే అనురక్తి, నాదశక్తి ఎలా సమకూరాయి? తపోవేదనా, ఆ వేదన లోంచి వచ్చే మంత్రం లాంటి మాట ఎలా వచ్చి కలిసాయి?

అన్నమయ్య విష్ణు మూర్తి ఖడ్గం అయిన "నందకం" అంటారు శ్రీవైష్ణవ సంప్రదాయము వారు. బహుశా ఆ ఖడ్గం భూమిపై అవతరించడానికి వస్తున్నప్పుడు సత్యలోకం గుండా వచ్చిందేమో, అందుకే సత్యలోకం లో ఉన్న బ్రహ్మాసరస్వతుల అనోన్యత ఆ ఖడ్గంలో ఒదిగిపోయింది. శివుడు అద్భుతంగా తాండవం ఆడుతుండగా అటుగా వస్తూ ఆ తాండవం లోని గమకం గ్రహించింది. ఇంద్ర సభలో నాట్య మాడుతున్న అప్సరసల కులుకులూ ఓడిసిపట్టిందేమో. హరిని  పొగడడానికే అవతరించిన నారదుల వారి మార్గాన పోతూ ఆ నారదుని హరి భక్తి, నాద స్ఫూర్తి గ్రహించిందేమో, హిమాలయ సిద్ధ భూములలో పరమాత్మ సందర్శనానికి పరితపించిన ఋషుల మనోభావాలు  అనుభూతి చెందింది. అయినా అది సహజంగా హరి ఖడ్గం. కామo , క్రోధo , లోభo  మోహo , మదo  మాత్సర్యం అనే లోపలి శత్రువులని తెగనరకటం దాని పని. అందుకే ఇన్ని అందాలను తనలో, తన కవిత్వంలో ఇముడ్చుకున్న మహానుభావునిగా జన్మనొందడానికి లక్కమాంబలోకి ప్రవేశించింది. ఆమె పుణ్య వనిత. అందుకే  ఆమెది గర్భాశయము కాదు గర్భాలయము!

అన్నమయ్య పుడుతుంటే ఎవరు పురుడు పోశారో? సాక్షాత్తు పద్మావతి దేవి, తనపై వయారంగా, చనువుగా శృంగార కీర్తనలు రాసే వాడిని ఈ లోకంలోకి తీసుకువచ్చిందేమో.
అది ఖడ్గం కాదు, విష్ణు తేజమే. ఒక్క సంకీర్తనే చాలు అనే రీతిలో వెలసిన 32 వేల సంకీర్తనల మహా కల్పతరువుకి నాదబీజం. (సంస్కృత భాషకి lexicon) అమరకోశం లాగా అన్ని పదాలనీ, అన్ని విషయాలనీ స్పృశిoచేది, ఆంద్ర భాషకు అమరత్వాన్ని కలిగించినది.

అన్నప్రాసన నాడు డబ్బులూ, పుస్తకం, కత్తి,  వంటివి పెట్టి ముచ్చట చేస్తే ఈ అన్నమయ్య ఏమి చేపట్టాడో? యితడు ప్రహ్లాదుడంతటి భక్తుడు!!! భాగవతం చేపట్టి ఉంటాడు. ధర్మాన్నీ, జ్ఞానాన్ని అతి రమ్యంగా , రుచిగా చెప్పిన భాగవతం నా కీర్తనలకి మార్గదర్శకము అని అప్పుడే చెప్పాడా? ఈతడు తెలుగు సరస్వతికి ఆరిపోని హారతి. అతని గుండెసడిలో కూడా పదకవిత వెల్లువయ్యేలా అన్నమయ్య తాళ్ళపాక వారి భాగ్యమై, కాదు కాదు ఈ తెలుగు జాతినే అంధకారంలోంచి కాంతి లోకి, అజ్ఞానం లోంచి జ్ఞానం వైపుకి  నడిపించే మార్గమై వెలిసాడు.

అన్నమయ్య గురించి పాట అనగానే   ఇన్ని అనుభూతులు కదిలి రాసిన ఒక scribe లాగా, సమీక్షకుడి లాగా రాసిన వాడు వేటూరి. 

ఇంతటి గొప్ప పాట రాయగలిగే అవకాశం, superhit commercial director సినిమా లో రావటం ఒక విచిత్రం!
వేటూరి తెలుగు పాటని భ్రష్టుపట్టించాడనే  వారికి ఒక  ప్రశ్న. 1976 లో commercial పాట రాయను అని వేటూరి అనుంటే, 1996 లో ఈ పాట రాయగలిగే అవకాశం అతనికి
వచ్చేదా?

వేటూరి జన్మదినం సందర్భంగా   ఆయనలోని సాహిత్యారాధకునికి  ఇది నా నివాళి !!!





1 comment:

  1. The essay is well written. The commentary explains not only the Scholarly greatness of అన్నమయ్య but also the comprehensive knowledge on the Scholar possessed by వేటూరి.

    ReplyDelete